Telangana: తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు
- 7 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు
- 23లోగా వెల్లడి కానున్న ఫలితాలు
- 24 నుంచి సెలవులు ప్రారంభం
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి మే నెలలో టెన్త్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిన తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందినా.. రోజురోజుకీ ఎండ వేడిమి పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 7 నుంచే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షా ఫలితాలను 23లోగా విడుదల చేయనున్నారు. ఆ మరునాటి నుంచే అంటే.. ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు మొదలు కానున్నాయి. భారీగా పెరిగిన ఎండ వేడిమి నేపథ్యంలో ఇప్పటికే మొదలైన ఒంటిపూట బడులను కూడా గురువారం నుంచి ఉదయం 11.30 గంటలకే ముగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే వేసవి సెలవులపైనా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.