IPL 2022: బెంగళూరుదీ తడబాటే..స్వల్ప లక్ష్యం చేరేనా?
- 2.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
- స్వల్ప స్కోరుకే అవుటైన డుప్లెసిస్, విరాట్‌లు
- పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ
తాజా ఐపీఎల్ సీజన్‌లో చెత్త రికార్డులే అధికంగా నమోదయ్యేలా ఉన్నాయి. ఈ సీజన్‌లో భాగంగా బుధవారం జరుగుతున్న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా.. దానిపై ఓ చెత్త రికార్డు నమోదు కానుంది. టాస్‌లో నెగ్గి కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆర్సీబీ.. తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసింది. బెంగళూరు బౌలర్ల ధాటికి కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పూర్తి ఓవర్లు ఆడకుండానే కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
ఆ తర్వాత 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ కూడా ఆదిలో తడబడింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ డూప్లెసిస్ 5 పరుగులు చేసి అవుట్ కాగా.. అతడి కంటే ముందే మరో ఓపెనర్ అనూజ్ రావత్ డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్‌లో అనూజ్ అవుట్ కాగా.. రెండో ఓవర్‌లో డుప్లెసిస్ అవుట్ అయ్యాడు.
రావత్ అవుట్‌తో క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసిన వెంటనే అవుట్ అయ్యాడు. ఇలా ముగ్గురు కీలక బ్యాటర్లు వరుసగా అవుట్ కావడంతో మూడో ఓవర్ తొలి బంతికే ఆర్సీబీ మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ 3 వికెట్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీయగా... మరొకటి టిమ్ సౌథీకి దక్కింది. కడపటి వార్తలందేసరికి ఆర్సీబీ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.