Dwayne Bravo: ఒక్క వికెట్ తీస్తే చాలు.. బ్రావో ఖాతాలో కొత్త రికార్డు
- బ్రావో ఖాతాలో 170 వికెట్లు
- లసిత్ మలింగ్ తో సమాన వికెట్లు
- ఒక్క వికెట్ తీసినా అగ్రస్థానానికి
- ఐపీఎల్ లో చరిత్రలో అత్యధిక వికెట్ల రికార్డు సొంతం
చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బౌలర్, వెస్టిండీస్ వెటరన్ డ్వేన్ బ్రావో గురువారం నాటి మ్యాచ్ లో నూతన రికార్డు సృష్టంచబోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరగనుంది. ఎందుకంటే రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్ లలో ఈ రెండూ ఓటమి చవిచూశాయి. దీంతో విజయంతో ఒత్తిడి దూరం చేసుకోవాలనే ఆరాటం సహజంగానే ఉంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేకేఆర్ చేతిలో ఓటమి పాలు కాగా, గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం ఎదుర్కొన్నది. తొలి మ్యాచ్ లో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ అర్ధ సెంచరీ, బ్రావో మూడు వికెట్లు తీయడం ఆకర్షణీయ అంశాలు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లోనూ బ్రావో చెలరేగిపోతే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు నమోదు కానుంది.
ప్రస్తుతం లసిత్ మలింగ ఐపీఎల్ చరిత్రలో 170 వికెట్లతో అగ్ర స్థానంలో ఉంటే, బ్రావో సైతం 170 వికెట్లతో సమస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత 166 వికెట్లతో అమిత్ మిశ్రా, 157 వికెట్లతో పీయూష్ చావ్లా, 150 వికెట్లతో హర్బజన్ సింగ్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ 145 వికెట్ల రికార్డు కలిగి ఉన్నాడు.