Revanth Reddy: ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన.. పాల్గొన్న రేవంత్ రెడ్డి
- పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఆందోళన
- పది రోజుల్లో తొమ్మిది సార్లు పెంచారన్న రాహుల్
- దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్న ఖర్గే
దేశంలో పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు ఉదయం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. పెరుగుతోన్న ధరలను అదుపులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని తమ పార్టీ నేతలు ముందే చెప్పారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.