MS Dhoni: 15 పరుగులు చేస్తే చాలు.. కోహ్లీ, రోహిత్ సరసన చేరనున్న ధోనీ
- ధోనీ ఖాతాలో 6,985 పరుగులు
- నేటు లక్నో సూపర్ జెయింట్స్ తో సీఎస్కే పోరు
- ధోనీ క్రీజ్ లో నిలదొక్కుకుంటే రికార్డు ఖాయం
- 7,000 పరుగుల క్లబ్ లోకి చేరిక
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్ కీపర్, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్ లో మరో గొప్ప మైలురాయికి చేరువగా వచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్ లో ధోనీ 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి, తనలోని పూర్వపు ఫామ్ ను అభిమానులకు మరోసారి చూపించాడు. కేకేఆర్ చేతిలో ఘోర పరాభవాన్ని తప్పించగలిగాడు. మ్యాచ్ ఓడినా ధోనీ ఇన్నింగ్స్ అభిమానులను ఆనందింపజేసింది.
గురువారం లక్నో సూపర్ జెయింట్స్ తో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్ లో కనుక ధోనీ క్రీజులో నిలదొక్కుకుని కనీసం 15 పరుగులు చేసినా, అతడు 7,000 పరుగుల క్లబ్ లోకి అడుగుపెడతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్ప సరసన చేరతాడు. వీరంతా టీ20 ఫార్మాట్లో 7,000 పరుగుల మైలురాయిని సాధించిన వారు కావడం గమనించాలి.
విరాట్ కోహ్లీ 10,326 పరుగులతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 9,936 పరుగులు సాధించగా.. శిఖర్ ధావన్ 8,818 పరుగులు, రాబిన్ ఊతప్ప 7,070 పరుగులు, ధోనీ ఖాతాలో 6,985 పరుగుల రికార్డు ప్రస్తుతం నమోదై ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే టీ20ల్లో కోహ్లీ ఐదో అత్యధిక స్కోరర్ గా ఉన్నాడు. 14,562 పరుగులతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.