Nara Lokesh: లాంతరు చేతబట్టిన నారా లోకేశ్.. విద్యుత్ చార్జీల పెంపుపై వినూత్న నిరసన
- ప్రిజనరీ ఆలోచనలతోనే విద్యుత్ చార్జీల పెంపు
- ప్రజలపై మోయలేని భారం మోపారు
- ఉగాది రోజునా మరో మోసపు పథకం
- విద్యుత్ చార్జీల పెంపుపై నారా లోకేశ్ విమర్శలు
ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచుతూ వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం నాడు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లాంతరు చేతబట్టుకుని ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ చార్జీలు పెంచుతూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు.
జగన్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపిందన్న లోకేశ్.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై అధికభారం మోపారని ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారన్న లోకేశ్.. ఉగాది రోజు మరో మోసపు పథకాన్ని అమల్లోకి తెచ్చారని విరుచుకుపడ్డారు.
అనేక పేర్లతో విద్యుత్ చార్జీలు పెంచి డబ్బు లాగేశారని ఆరోపించిన ఆయన.. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రిజనరీ ఆలోచనలతోనే జగన్ సర్కారు జనంపై భారం మోపారన్న లోకేశ్.. ఇప్పటికైనా కక్షసాధింపులు మాని జగన్ పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.