Vijay Sai Reddy: రాజ్యసభలో సాయిరెడ్డి వీడ్కోలు సందేశం
- త్వరలో ముగియనున్న సాయిరెడ్డి తొలి టెర్మ్
- తన రాజకీయ ప్రస్థానానికి కాంగ్రెస్ కుట్రలే కారణమంటూ వ్యాఖ్య
- జైరాం రమేశ్ తనకు మిత్రుడంటూనే ఏపీ ప్రజల శత్రువుగా అభివర్ణణ
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజ్యసభలో తన వీడ్కోలు సందేశాన్ని వినిపించారు. పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాల్లో భాగంగా గురువారం రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతితో సాయిరెడ్డి తన వీడ్కోలు సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై సాయిరెడ్డి సంధించిన విమర్శలతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
కాంగ్రెస్ పార్టీ తమపై కేసులు పెట్టిన కారణంగానే జగన్ ప్రత్యేకంగా వేరే పార్టీ పెట్టాల్సి వచ్చిందని, ఆ క్రమంలోనే తనను జగన్ రాజ్యసభకు పంపారని సాయిరెడ్డి చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ తాను ఇష్టపడే నేత అని చెబుతూనే.. ఏపీ ప్రజలు శత్రువుగా చూసే నేత కూడా రమేశేనని వెల్లడించారు. ఈ సందర్భంగా జైరాం అడ్డుకునేందుకు యత్నించినా సాయిరెడ్డి పెద్దగా పట్టించుకోలేదు.
ఇక సభలో తనకు సలహాలు సూచనలు ఇచ్చిన నేతల పేర్లలో కొన్నింటిని ప్రస్తావించిన సాయిరెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మోదీ కేబినెట్‌లోని డైనమిక్ మంత్రిగా అభివర్ణించారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో తన అనుబంధాన్ని కూడా సాయిరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఓ చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న తాను సభలో అడుగుపెట్టి ఏపీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినందుకు గర్వంగా ఉందని కూడా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.