Telangana: ఎండలు మండుతున్నాయి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

TS Health director warns not to come out side as day temperatures crossed 40 degrees

  • పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా చేరుకున్నాయి
  • మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దు
  • కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవద్దన్న డాక్టర్ శ్రీనివాసరావు 

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిపోయిందని... ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా చేరుకున్నాయని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని అన్నారు. 

బయట ఉంటూ విధులు నిర్వహించేవారు నీరు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. కలుషితమైన నీరు, నిల్వ చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని తెలిపారు. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి, వారికి గాలి ఆడేలా చూడాలని సూచించారు. అరగంటలో వడదెబ్బ లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపారు.

  • Loading...

More Telugu News