Janasena: విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం: పవన్ కల్యాణ్
- విద్యుత్ చార్జీల పెంపుపై పవన్ విమర్శలు
- రేపు కలెక్టర్లకు జనసేన వినతి పత్రాలు
- వీడియో సందేశంలో జనసేనాని వెల్లడి
విద్యుత్ చార్జీల పెంపుపై జగన్ ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం సాగిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు కాసేపటి క్రితం ఫేస్ బుక్ వేదికగా ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ పోరాటంలో భాగంగా శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని పవన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను పవన్ ప్రస్తావించారు. 200 యూనిట్ల మేర వినియోగించే వారికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలను పెంచేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంపై బాదుడే బాదుడు అన్న వైసీపీ.. ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
తాజాగా రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుకగా జగన్ సర్కారు రూ.1,400 కోట్ల మేర వసూలు కోసం విద్యుత్ చార్జీలను పెంచేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.