Sujana Chowdary: రాజ్యసభలో వీడ్కోలు సందేశం... చంద్రబాబును గుర్తు చేసుకున్న సుజనా చౌదరి
- చంద్రబాబును గుర్తు చేసుకున్న సుజనా
- రెండు సార్లు చంద్రబాబే రాజ్యసభకు పంపారని వెల్లడి
- రాజకీయంగా విభేదిస్తున్నా చంద్రబాబుపై గౌరవముందన్న ఎంపీ
రాజ్యసభలో బీజేపీ ఎంపీ వై.సుజనా చౌదరి తన వీడ్కోలు సందేశాన్ని వినిపించారు. వరుసగా రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి సెంకడ్ టెర్మ్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో ఆయన తన వీడ్కోలు సందేశాన్ని వినిపించారు.
విద్య రీత్యా ఇంజినీర్ అయిన తాను వృత్తి రీత్యా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనని తెలిపిన సుజనా.. తన రాజకీయ ప్రస్థానం మొదలై 12 ఏళ్లు అవుతోందని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంతో పాటు రాజ్యసభలో తన ప్రస్థానం కూడా 12 ఏళ్లేనని చెప్పిన సుజనా.. తనను తొలిసారిగా రాజ్యసభకు పంపిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు పర్యాయాలు కూడా చంద్రబాబే తనను రాజ్యసభకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం టీడీపీతో పాటు చంద్రబాబుతోనూ రాజకీయంగా విభేదిస్తున్నప్పటికీ ఓ విజనరీగా చంద్రబాబుపై తనకు అపారమైన గౌరవం ఉందని సుజనా చెప్పారు. ఇక సభలో తనకు మార్గదర్శకులుగా నిలిచిన పలువురి పేర్లను ప్రస్తావించిన సుజనా చౌదరి.. ప్రధాని మోదీకి, బీజేపీకి, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభతో పాటు పార్లమెంటు సిబ్బందికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.