- సుదీర్ఘకాలం తర్వాత ఎదురుపడ్డ మాజీ సహచరులు
- లక్నో-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా మాటామంతి
- కెప్టెన్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందన్న గంభీర్
- ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో షేర్
ఇద్దరూ కలసి సుదీర్ఘకాలం పాటు భారత్ జట్టుకు సేవలు అందించినవారే. ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు వీరు ఐపీఎల్ లో రెండు జట్లకు సేవలు అందిస్తున్నారు. వారిలో ఒకరు సీఎస్కే సభ్యుడు, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కాగా.. మరొకరు లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్ అయిన గౌతమ్ గంభీర్.
ఇద్దరూ చాలా కాలం తర్వాత బ్రాబౌర్న్ స్టేడియంలో ఎదురుపడ్డారు. ఇంత కంటే మంచి సందర్భం ఉంటుందా? దాంతో వారు ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. దీనిపై గంభీర్ తన స్పందనను కూడా వ్యక్తం చేశాడు. కెప్టెన్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. అందుకు సంబంధించి ఫొటోను కూడా షేర్ చేశాడు. వీరి ముఖాముఖిని అభిమానులు కూడా స్వాగతించారు.
211 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చేరుకుని మొదటి విజయం నమోదు చేయడం తెలిసిందే. గౌతమ్ గంభీర్ తన కెరీర్ లో ఎక్కువ కాలం ధోనీ నాయకత్వంలోనే పనిచేశాడు. 2011 ప్రపంచకప్ సాధించిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ధోనీ నాయకత్వంలోనే భారత్ ప్రపంచ కప్ గెలవడం తెలిసిందే. 2018లో క్రికెట్ కు గంభీర్ గుడ్ బై చెప్పగా.. 2020లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు.