- అతడి బ్యాటింగ్ అసాధారణం
- వైట్ బాల్ క్రికెట్ కు గొప్ప ఆస్తి అవుతాడు
- 360 డిగ్రీల్లోనూ ఆడగల సమర్థుడు
- లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ ప్రశంసలు
భారత యువ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చోటు సంపాదించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆయుష్ బదోనిపై ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టుకు అతడు ఒక మంచి అస్సెట్ అవుతాడని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ తాజా సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మొదటి మ్యాచ్ లోనే బదోని అర్ధ సెంచరీతో మెరిశాడు. రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో 9 బంతుల్లోనే 19 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు.
‘‘మీరు కేవలం మంచి షాట్స్ నే చూసిన సందర్భంలో అతడికి సంబంధించి నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. అతడు బ్యాటింగ్ చేసే తీరు నిజంగా అసాధారణం. 360 డిగ్రీల కోణంలోనూ షాట్స్ ఆడగల క్రికెటర్ అతడు. వైట్ బాల్ క్రికెట్ కు అతడు గొప్ప ఆస్తిగా మారతాడు’’ అని రాహుల్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ మెగా వేలంలో కేవలం రూ.20 లక్షల ధరకే బదోనీని లక్నో జట్టు సొంతం చేసుకుంది. ఇప్పుడు అతడే జట్టుకు కీలకమైన ప్లేయర్ గా మారాడు. 22 ఏళ్ల ఈ ఢిల్లీ క్రికెటర్ అండర్ -19 జట్టులో సభ్యుడు.