Sergei Lavrov: భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్ భేటీ
- రెండ్రోజుల భారత్ పర్యటనకు వచ్చిన లవ్రోవ్
- ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లో జై శంకర్ తో సమావేశం
- ద్వైపాక్షిక అంశాలపై చర్చ
- ఉక్రెయిన్ సంక్షోభంపై తమ బాణీ వినిపించే అవకాశం
ఉక్రెయిన్ పై సైనికచర్య కొనసాగుతున్న తరుణంలో రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్ భారత్ పర్యటనకు విచ్చేశారు. అంతర్జాతీయ సమాజం రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో, లవ్రోవ్ తమకు చిరకాల మిత్రదేశం అయిన భారత్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, లవ్రోవ్ నేడు ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తో భేటీ అయ్యారు. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ ఈ కీలక సమావేశానికి వేదికగా నిలిచింది. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో వెల్లడించింది.
లవ్రోవ్ రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు వచ్చారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభం అయ్యాక లవ్రోవ్ భారత్ రావడం ఇదే ప్రథమం. గతవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటించారు. ఏప్రిల్ 11న భారత్, అమెరికా మధ్య 2 ప్లస్ 2 విధానంలో చర్చలు జరగాల్సి ఉంది.
కాగా, భారత్ కు వచ్చేముందు లవ్రోవ్ చైనాలో పర్యటించారు. లవ్రోవ్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి రష్యా ప్రయత్నిస్తోందని, శాంతి చర్చలకు తాము కట్టుబడి ఉన్నామని చైనాకు వివరించారు. తాజాగా, భారత్ తో చర్చల సందర్భంగానూ లవ్రోవ్ ఇదే బాణీ వినిపించే అవకాశం ఉంది.