Ganesh Acharya: ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యపై లైంగిక వేధింపుల కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
- తనను లైంగికంగా వేధించాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు
- శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడన్న బాధితురాలు
- 2020లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యపై నమోదైన లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఛార్జిషీట్ వేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన వద్ద పని చేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు 2020లో ఫిర్యాదు చేసింది. శృంగారంలో పాల్గొనాలని తనను బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పోర్న్ వీడియోలు చూపించి, ఎంతో వేధించాడని తెలిపింది. తనతో శృంగారానికి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని ఆరోపించింది.
తాను ఒప్పుకోకపోయేసరికి గణేశ్ మాస్టర్, ఆయన అసిస్టెంట్లు తనపై దాడి చేశారని... 6 నెలల కాలంలోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో సభ్యత్వాన్ని రద్దు చేయించారని బాధితురాలు తెలిపింది. వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని... నాన్ కాగ్నిసబుల్ కేసును నమోదు చేశానని, తదుపరి చర్యల కోసం లాయర్ ను కూడా సంప్రదించానని చెప్పింది.
ఆమె ఫిర్యాదు మేరకు 354 ఏ, 354 సీ, 354 డీ, 509, 323, 504 సెక్షన్ల కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ముంబైలోని ఓ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పుష్ప సినిమాలో 'ఊ అంటావా.. ఊఊ అంటావా మామ' పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసింది గణేశ్ మాస్టరే కావడం గమనార్హం.