Narendra Modi: పోటీతత్వం మనల్ని ముందుకు నడిపిస్తుంది: ప్రధాని మోదీ
- దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్
- విద్యార్థులకు మోదీ దిశానిర్దేశం
- విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
- పోటీ అనేది జీవితంలో ఒక భాగమని వెల్లడి
దేశవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షల సీజన్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఆయన వర్చువల్ విధానంలో కర్తవ్య బోధ చేశారు. విద్యార్థులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని, నిత్యం తమను తాము పరీక్షించుకుంటుండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కలిసి చర్చించుకోవడం ద్వారా అనేక విషయాలను గుర్తుంచుకోవచ్చని సూచించారు. తాము నేర్చుకోవాలని భావించిన అంశాన్ని విద్యార్థులు తమ స్నేహితులతో చర్చించాలని అన్నారు.
విద్యార్థులు చదివే అంశంపై దృష్టి సారించాలని, మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలని తెలిపారు. పోటీతత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుందని, పోటీ అనేది జీవితంలో ఒక భాగమని పేర్కొన్నారు. విజయానికి పోటీ అవసరం అని ఉద్ఘాటించారు. అయితే మనలోని లోపాలను తెలుసుకుని సరిదిద్దుకోవడం చాలా అవసరం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో గురువుల బాధ్యత సిలబస్ వరకు మాత్రమే పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు.
ఇక మహిళా శక్తి గురించి చెబుతూ... బాలిక, బాలుడు ఇద్దరూ సమానమేనని, ఎలాంటి భేదం లేదని మోదీ పేర్కొన్నారు. పురాణకాలం నుంచి మహిళలు ముందంజలో ఉన్నారని, భారత్ లో మహిళలు శక్తిమంతంగా ఎదుగుతున్నారని వివరించారు. గ్రామాల్లో బాలికలు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారని, సైనిక స్కూళ్లలోనూ బాలికలు చేరుతున్నారని వివరించారు.
"అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. భారత పార్లమెంటులో ఎంతోమంది మహిళా ఎంపీలు ఉన్నారు. దేశంలో మహిళా నర్సులు అన్ని చోట్లా సేవలు అందిస్తున్నారు. పోలీసు శాఖలోనూ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్సీసీలోనూ రాణిస్తున్నారు. మహిళలు సైన్యంలో కూడా చేరుతున్నారు" అని వివరించారు.