Raghunandan Rao: బందోబస్తు కల్పించాలని ఫోన్ చేసి అడిగినా సిద్ధిపేట ఏసీపీ పట్టించుకోలేదు: రఘునందన్ రావు
- మార్కెట్ ప్రారంభానికి వెళ్తే టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు
- తనపై భౌతికదాడి చేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోలేదు
- కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు
తన నియోజకవర్గం దుబ్బాకలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభానికి వెళ్తే టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బందోబస్తు కల్పించాలని ఫోన్ చేసి అడిగినా సిద్ధిపేట ఏసీపీ పట్టించుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే... వారిపై తమ పార్టీకి చెందిన మహిళలు తిరుగుబాటు చేశారని చెప్పారు. తనపై భౌతికదాడి చేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోలేదని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఆందోళన చేస్తే పోలీసులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో తానుంటే... స్టేషన్ బయట టీఆర్ఎస్ నేతలతో ఏసీపీ సంప్రదింపులు జరిపారని రఘునందన్ రావు మండిపడ్డారు. శిలాఫలకాన్ని కూల్చిన వ్యక్తులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తనపై దాడికి యత్నించిన వారిపై ఇంత వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని అడిగారు.