NV Ramana: నాయకులు వస్తుంటారు, పోతుంటారు... దర్యాప్తు సంస్థలు శాశ్వతం: సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana attends a program in Delhi and opines on investigation agencies

  • ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ
  • పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాలని సూచన
  • స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థలు కావాలని అభిలాష

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం అత్యావశ్యకం అని అభిప్రాయపడ్డారు. 

స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం అని పేర్కొన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు... కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని ఉద్ఘాటించారు. అదే సమయంలో ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీజేఐ అభిలషించారు. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ రావాలని తెలిపారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలని వివరించారు. 

శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, చాలావరకు నేర విచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుందని తెలిపారు. విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనుకబడుతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అవసరమని ఉద్ఘాటించారు. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. సంబంధాల మెరుగుకు పోలీసు శిక్షణ విధానంలో మార్పు రావాలని సూచించారు.

  • Loading...

More Telugu News