Andhra Pradesh: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖకు రికార్డు ఆదాయం.. రాష్ట్ర విభజన తర్వాత అత్యధికం ఇదేనట!
- మార్చిలో రిజిస్ట్రేషన్ల శాఖకు వెయ్యి కోట్ల ఆదాయం
- గతేడాది ఇదే నెలతో పోలిస్తే 35 శాతం అధికం
- రియల్ ఎస్టేట్ జోష్‌తోనే ఈ ఆదాయమన్న రజత్ భార్గవ
రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌తో ప్రస్థానం మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆదాయం క్రమంగా పెరుగుతోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా మార్చి నెలకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఏకంగా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ శాఖకు ఇప్పటిదాకా ఈ మేర ఆదాయం రావడం ఇదే ప్రథమమని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన రజత్ భార్గవ.. మార్చిలో వచ్చిన ఆదాయం గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయాని కంటే 35 శాతం అధికమని తెలిపారు. నిన్నటితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ శాఖకు రూ. 7,327 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోయినా..ఈ మేర ఆదాయం పెరిగిందన్న ఆయన.. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ రావడంతో ఆదాయం పెరిగినట్లు తెలిపారు.