BJP: రాజ్యసభలో సెంచరీ కొట్టిన బీజేపీ
- ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన బీజేపీ
- పంజాబ్‌లో ఓ సీటును కోల్పోయిన కమలం పార్టీ
- 1990 తర్వాత వంద మార్కును చేరిన తొలి పార్టీగా బీజేపీ
కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. పార్లమెంటులోని దిగువ సభలో ఎప్పుడో స్పష్టమైన మెజారిటీ సాధించినా.. పెద్దల సభగా పరిగణిస్తున్న ఎగువ సభ రాజ్యసభలో మాత్రం మెజారిటీ సాధించలేకపోయింది. అయితే ఇటీవలే ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకున్న బీజేపీ.. రాజ్యసభలో తమ సభ్యుల సంఖ్యను 100కు చేర్చుకుంది.
ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అసోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన ఒక్కో సీటును బీజేపీ గెలుచుకుంది. అదే సమయంలో పంజాబ్ కోటాలో ఐదు సీట్లకు ఎన్నికలు జరగగా.. తన ఖాతాలోని ఓ సీటును బీజేపీ కోల్పోగా..మొత్తం 5 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎగురవేసుకుపోయింది. ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ.. పంజాబ్‌లోని ఓ సీటును వదులుకున్నప్పటికీ రాజ్యసభలో సెంచరీ మార్కును చేరుకుంది. ఇదిలా ఉంటే..1990 తర్వాత రాజ్యసభలో 100 మంది సభ్యులు కలిగిన పార్టీగా బీజేపీకి అరుదైన గుర్తింపు దక్కింది.