Rahul Dev: ఎస్ఎస్ రాజమౌళా... ఆయనెవరు? అని అడిగేవాళ్లు: రాహుల్ దేవ్
- 2003లో 'సింహాద్రి' సినిమాలో నటించానన్నా రాహుల్
- 'బాహుబలి' తర్వాత రాజమౌళి స్థాయి అందరికీ తెలుసని వ్యాఖ్య
- ఆయనతో పని చేసేందుకు అంతా పడిచచ్చిపోతున్నారని వెల్లడి
- చిన్నదో, పెద్దదో, ఏదో ఒక పాత్ర దొరికితే చాలని భావిస్తున్నారన్న రాహుల్ దేవ్
భారత్ లో ఎస్ఎస్ రాజమౌళి పేరు తెలియని వారుంటారా?... ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి క్రేజ్ జాతీయ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎక్కడైనా థియేటర్ల వద్ద హీరోలకు కటౌట్లు ఏర్పాటు చేస్తారు. కానీ దర్శకధీరుడు రాజమౌళి కటౌట్ ఏర్పాటు చేశారంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఆయన ఖ్యాతి దేశ సరిహద్దులు దాటింది.
కాగా, రాజమౌళితో గతంలో 'సింహాద్రి' సినిమాలో నటించిన విలన్ పాత్రల నటుడు రాహుల్ దేవ్ ఆసక్తికర అంశం వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ దేవ్ మాట్లాడుతూ, 2003లో తాను రాజమౌళి దర్శకత్వంలో 'సింహాద్రి' సినిమాలో నటించానని తెలిపారు. ఆ సమయంలో తాను రాజమౌళి గురించి చెబుతుంటే కొందరు తనను ఎస్ఎస్ రాజమౌళా... ఆయనెవరు? అని అడిగేవారని గుర్తు చేసుకున్నారు.
కానీ బాహుబలి వంటి భారీ చిత్రం తర్వాత రాజమౌళి ఏ స్థాయికి చేరాడో అందరికీ తెలిసేందనని అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనతో పని చేసేందుకు పడిచచ్చిపోతున్నారని రాహుల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఆయన చిత్రాల్లో చిన్నదో, పెద్దదో, ఏదో ఒక పాత్ర దొరికితే అదే చాలని భావిస్తున్నారని వివరించారు.
అంతేకాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి కూడా రాహుల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 32 దక్షిణాది సినిమాల్లో నటించానని, రాజమౌళి, ప్రభుదేవా, లారెన్స్ వంటి వారి దర్శకత్వంలో నటించానని తెలిపారు. అక్కడి సినిమాల్లో ఎందుకు నటిస్తున్నావ్ అని కొందరు ఆశ్చర్యంగా అడిగేవారని, కానీ ఇప్పుడందరూ దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారని వెల్లడించారు. అజయ్ దేవగణ్ కూడా దక్షిణాదికి వెళ్లాడని తెలిపారు. అమితాబ్ బచ్చన్ కూడా సౌత్ లో నటిస్తున్నారని, అక్షయ్ కుమార్ ఇప్పటికే రజనీకాంత్ తో ఓ సినిమా చేశారని రాహుల్ దేవ్ వెల్లడించారు.