Punjab Kings: దూకుడుగా ఆడబోయి... స్వల్ప స్కోరుకే ఆలౌటైన పంజాబ్ కింగ్స్
- ముంబయిలో కోల్ కతా వర్సెస్ పంజాబ్
- టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
- 18.2 ఓవర్లలో 137 పరుగులు చేసిన పంజాబ్
- 9 బంతుల్లోనే 31 పరుగులు చేసిన రాజపక్స
- చివర్లో రబాడా మెరుపులు
కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దూకుడుగా ఆడి భారీ స్కోరు సాధించే యత్నంలో పంజాబ్ వ్యూహం బెడిసికొట్టింది. దాంతో 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. బరిలో దిగిన ప్రతి బ్యాట్స్ మన్ బంతిని బౌండరీలు దాటించేందుకే ప్రాధాన్యత నిచ్చారు. దాంతో కోల్ కతా బౌలర్లకు వికెట్లు తీయడం తేలికైంది.
పంజాబ్ జట్టులో భానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజపక్స 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1), షారుఖ్ ఖాన్ (0) విఫలమయ్యారు. ధావన్ 16, లివింగ్ స్టన్ 19, రాజ్ బవా 11, హర్ ప్రీత్ బ్రార్ 14 పరుగులు చేశారు. ఆఖర్లో కగిసో రబాడా ధాటిగా ఆడడంతో పంజాబ్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. 16 బంతులాడిన రబాడా 4 ఫోర్లు, 1 సిక్స్ తో 15 పరుగులు చేశాడు. ఓడియన్ స్మిత్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు తీయడం విశేషం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ లో నిప్పులు చెరుగుతున్న ఉమేశ్... మరోసారి అదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇక టిమ్ సౌథీకి 2, శివమ్ మావికి 1, నరైన్ కు 1, రస్సెల్ కు 1 వికెట్ దక్కాయి.