Punjab Kings: రసెల్ వీరబాదుడు.. కోల్‌కతా ఖాతాలో మరో విజయం
- తొలుత బంతితో నిప్పులు చెరిగిన ఉమేశ్ యాదవ్
- ఆ తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోయిన రసెల్
- ప్రేక్షకులకు అసలైన మజా
- బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన పంజాబ్
ఆండ్రి రసెల్ చెలరేగిపోయాడు. సహజ సిద్ధమైన ఆటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బంతులను స్టాండ్స్ నలువైపులా తరలిస్తూ ఐపీఎల్‌లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందించాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు 8 సిక్సర్లతో 70 పరుగులు చేసి కోల్‌కతా జట్టుకు మరో విజయాన్ని అందించాడు.
పంజాబ్ కింగ్స్‌తో గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలోనే ఛేదించింది.
అజింక్య రహానే (12), వెంకటేశ్ అయ్యర్ (3) విఫలం కాగా, శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులు చేశాడు. నితీశ్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో శామ్ బిల్లింగ్స్ (24 నాటౌట్) అండగా విధ్వంసం సృష్టించిన రసెల్ వీరవిహారం చేశాడు. మరో 5.3 ఓవర్లు ఉండగానే జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దూకుడుగా ఆడి భారీ స్కోరు సాధించాలన్న ఆ జట్టు వ్యూహం బెడిసికొట్టింది. దాంతో 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. బరిలో దిగిన ప్రతి బ్యాట్స్ మన్ బంతిని బౌండరీలు దాటించేందుకే ప్రాధాన్యత నిచ్చారు. దాంతో కోల్ కతా బౌలర్లకు వికెట్లు తీయడం తేలికైంది.
పంజాబ్ జట్టులో భానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజపక్స 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1), షారుఖ్ ఖాన్ (0) విఫలమయ్యారు. ధావన్ 16, లివింగ్ స్టన్ 19, రాజ్ బవా 11, హర్ ప్రీత్ బ్రార్ 14 పరుగులు చేశారు.
ఆఖర్లో కగిసో రబాడా ధాటిగా ఆడడంతో పంజాబ్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. 16 బంతులాడిన రబాడా 4 ఫోర్లు, 1 సిక్స్ తో 15 పరుగులు చేశాడు. ఓడియన్ స్మిత్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా, టిమ్ సౌథీకి 2, శివమ్ మావికి 1, నరైన్ కు 1, రస్సెల్ కు 1 వికెట్ దక్కాయి. ఈ విజయంతో కోల్‌కతా నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.