Karnataka: పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిన విద్యార్థి.. ఆగ్రహంతో చెయ్యి కొరికేసిన అధ్యాపకుడు!
- కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఘటన
- పట్టుబడిన విద్యార్థితో వాగ్వివాదం
- పరస్పరం కేసులు.. చివరికి రాజీ
పరీక్షల్లో కాపీ కొడుతున్న విద్యార్థిని పట్టుకున్న ఓ లెక్చరర్ ఆగ్రహంతో అతడి చెయ్యిని కొరికేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాలోని డిగ్రీ కళాశాలలో జరిగిందిది. ఇక్కడ బీఏ పరీక్షలు జరుగుతుండగా ఓ విద్యార్థి కాపీ కొడుతుండడాన్ని ఇన్విజిలేటర్‌గా ఉన్న అధ్యాపకుడు గమనించి పట్టుకున్నారు.
దీంతో విద్యార్థి, అధ్యాపకుడు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన లెక్చరర్ విద్యార్థి చెయ్యి కొరికేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా కొందరు విద్యార్థులు బయటపెట్టడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థి, లెక్చరర్ పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత రాజీపడి కేసులు ఉపసంహరించుకున్నారు.