Andre Russell: అలాంటి సమయాల్లో ఎలా ఆడాలో తెలుసు.. విధ్వంసకర బ్యాటింగ్ పై రస్సెల్ స్పందన
- శామ్ సహకారం ఉంది
- కొన్ని ఓవర్ల పాటు నిలదొక్కుకో
- ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడని చెప్పాను
- తన ఆట ప్రణాళికను వివరించిన రస్సెల్
పంజాబ్ కింగ్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించంపై స్పందించాడు. కేవలం 31 బంతులను ఎదుర్కొన్న అతడు ఎనిమిది సిక్సర్లతో 70 పరుగులు సాధించి ఒంటి చేత్తో కేకేఆర్ కు విజయాన్నిచ్చాడు. ‘‘అద్భుతంగా ఉంది. మేము ఆటను ఆడటానికి కారణం ఇదే. ఆ పరిస్థితిలో ఎలా ఆడాలన్నది నాకు తెలుసు’’ అని రస్సెల్ చెప్పాడు.
టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ తీసుకుని కింగ్స్ ను 18 ఓవర్లకే 137 పరుగులకు కట్టడి చేసింది. లక్ష్యం చిన్నదే అయినా కేకేఆర్ 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న సమయంలో రస్సెల్ బ్యాట్ తో బరిలోకి దిగాడు. అతడికి తోడుగా క్రీజులో శామ్ బిల్లింగ్స్ ఉన్నాడు. తనకు సహకారం అందిస్తే చెలరేగిపోతానంటూ శామ్ కు రస్సెల్ సంకేతం ఇచ్చాడు.
‘‘శామ్ వంటి వ్యక్తి క్రీజులో ఉండడం అనుకూలించింది. కష్ట సమయంలో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ నాకు సహకారం అందించాడు. ఒక్కసారి నేను కుదురుకున్న తర్వాత ఇక నేను చూసుకుంటానన్నాను. కొన్ని ఓవర్లు పాటు బ్యాటింగ్ చేయి, అప్పుడు ఏం జరుగుతుందో చూడని శామ్ కు చెప్పాను’’ అని రస్సెల్ వివరించాడు. క్రిస్ గేల్ మాదిరే క్రీజులో నిలదొక్కుకుంటే రస్సెల్ విధ్వంసం సృష్టిస్తాడని ఎన్నో సందర్భాల్లో రుజువైంది.