finance minister: చమురు చౌకగా వస్తుంటే ఎందుకు కొనకూడదు?: ఆర్థిక మంత్రి సీతారామన్ సూటి ప్రశ్న
- ఇంధన అవసరాలు, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం
- 3-4 రోజుల అవసరాలకు సరిపడా కొనుగోళ్లు
- ఓ కార్యక్రమం సందర్భంగా స్పందించిన ఆర్థిక మంత్రి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు పెంచుకోవద్దని, రష్యాపై విధించిన ఆంక్షలకు ప్రపంచదేశాలు కట్టుబడి ఉండాలంటూ అమెరికా పరోక్షంగా చేసిన హెచ్చరికల నేపథ్యంలో మంత్రి సీతారామన్ స్పందించారు. తన ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్ పై ఉంటుందని గుర్తు చేశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లెవ్రోవ్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే మంత్రి దీనిపై స్పందించడం గమనార్హం.
‘‘రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఆరంభించాము. కనీసం మూడు, నాలుగు రోజుల అవసరాలకు సరిపడా కొన్నాము. ఇంధన భద్రత, దేశ ప్రయోజనాలకే మా మొదటి ప్రాధాన్యత. చమురు సరఫరా తక్కువ ధరకు వస్తుంటే ఎందుకు కొనుగోలు చేయకూడదు?’’ అని మంత్రి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇప్పటికే రష్యా ఆయిల్ కొనుగోలుకు ఆర్డర్లు కూడా ఇచ్చాయి. అయితే ఇప్పటికీ రష్యా నుంచి భారీ ఎత్తున ఆయిల్ కొనుగోలు చేయడం లేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. భారత ఇంధన సరఫరాలో రష్యా వాటా ఇక ముందూ పరిమితంగానే ఉంటుందని విదేశాంగ మంత్రి జై శంకర్ సైతం ప్రకటన చేశారు.