New Covid: కరోనా కొత్త రకం ‘ఎక్స్ఈ’కి మరింత వేగంగా వ్యాపించే గుణం
- బీఏ.2 కంటే 10 శాతం వేగంగా విస్తరించగలదు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన
- వ్యాప్తిలో మూడు రీకాంబినెంట్ రకాలు
- ఇంకా వేగం తగ్గని బీఏ.2 రకం
కొత్తగా బయట పడిన కరోనా మ్యుటెంట్ ‘ఎక్స్ఈ’కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రకటించింది. కరోనా ఒమిక్రాన్ లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా పరిగణిస్తున్నారు. కానీ, దీంతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించే లక్షణం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలసిన రూపం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు.
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. మూడు రకాల రీకాంబినెంట్ స్ట్రెయిన్లు ఎక్స్ డీ, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. గతంలో వెలుగు చూసిన రెండు ఉప రకాలతో కలసిన స్వరూపాన్ని రీకాంబినెంట్ గా చెబుతారు. ఇందులో ఎక్స్ డీ అన్నది.. డెల్టా, బీఏ.1 కలసిన రకం. ఎక్స్ఎఫ్ అన్నది డెల్టా, బీఏ.1 కలసిన మరొక రూపం.