TDP: జగన్ స్థానంలో ఇంకెవరున్నా రాజీనామా చేసేవారు: వర్ల రామయ్య
- ఐఏఎస్‌లకు జైలు శిక్షపై వర్ల స్పందన
- కోర్టులపై జగన్‌కున్న వ్యతిరేక భావనే కారణం
- కోర్టు దయతోనే ఐఏఎస్‌లకు జైలు తప్పింది
- ఐఏఎస్‌లకు జైలు శిక్షకు సీఎందే నైతిక బాధ్యత అన్న వర్ల
ఏపీ కేడర్ ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష విధించడం, ఆపై ఐఏఎస్ అధికారులు అక్కడికక్కడే బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో జైలు శిక్షను సేవకు మార్చిన వైనంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కోర్టు తీర్పులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణ కేసుల్లో ఇరుక్కుంటున్న వైనంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. మరో అడుగు ముందుకేసి.. ఈ తరహా పరిస్థితి ఎదురైనప్పుడు జగన్ కాకుండా సీఎంగా ఇంకెవరున్నా పదవికి రాజీనామా చేసేవారంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.."ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష దేశ చరిత్రలోనే లేదు. న్యాయ వ్యవస్థపై సీఎం జగన్‌కు ఉన్న వ్యతిరేక భావనతోనే ఐఏఎస్‌లకు జైలు శిక్ష తప్పట్లేదు. న్యాయ వ్యవస్థ దయతో అధికారులు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ఐఏఎస్‌లకు జైలు శిక్ష పడింది. సీఎం స్థానంలో జగన్ కాకుండా ఇంకెవరున్నా రాజీనామా చేసేవారు. ఐఏఎస్‌లకు శిక్షపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవారు" అంటూ వర్ల వ్యాఖ్యానించారు.