AP High Court: హైకోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన అంశాలివే!

ap government quotes in affidavit filed in high court

  • రాజ‌ధాని ప‌నుల‌కు 60 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది
  • అమ‌రావ‌తి నుంచి కూలీలు వెళ్లిపోయారు
  • కూలీలు, యంత్రాలను ర‌ప్పించేందుకే 2 నెల‌లు ప‌డుతుంది
  • నిధుల కోసం సీఆర్డీఏ అధికారులు య‌త్నిస్తున్నారు
  • హైకోర్టులో దాఖ‌లు చేసిన అఫిడవిట్‌లో ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పున‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం తాజాగా కోర్టుకు ఓ అఫిడవిట్ స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు నిర్దేశించిన గ‌డువు ముగుస్తున్న చివ‌రి క్ష‌ణంలో ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన ఈ అఫిడ‌విట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఏకంగా 190 పేజీల‌తో కూడిన ఆ అఫిడ‌విట్‌లో ఏపీ ప్ర‌భుత్వం ఏఏ అంశాల‌ను ప్రస్తావించింద‌న్న దానిపై తాజాగా కొన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఓ రాజ‌ధాని నిర్మాణంపై నెల రోజుల గ‌డువు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం స‌బ‌బు కాద‌న్న వాద‌న‌ను వినిపించేందుకే ఏపీ ప్ర‌భుత్వం ఈ అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేసింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ అఫిడ‌విట్‌లో ఏఏ అంశాల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తావించింద‌న్న విష‌యానికి వ‌స్తే.. హైకోర్టు విధించిన గ‌డువులో రాజ‌ధాని నిర్మాణం సాధ్యం కాద‌ని అఫిడ‌విట్‌లో ప్ర‌భుత్వం తేల్చేసింది. మౌలిక స‌దుపాయాల నిర్మాణాల‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. వీటి కోసం 6 నెల‌లు కాదు 60 నెల‌లు ప‌డుతుంద‌ని కోర్టుకు తెలిపింది. అమ‌రావ‌తి ప్రాంతం నుంచి నిర్మాణ కార్మికులు వెళ్లిపోయార‌ని చెప్పిన ప్ర‌భుత్వం..వ‌ర్క‌ర్ల‌తో పాటు యంత్రాల‌ను ర‌ప్పించేందుకే 2 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపింది. ప‌నులు మొద‌లుపెట్టేందుకు 8 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా ప్రభుత్వం వెల్ల‌డించింది.

ఇక రాజ‌ధాని ప‌రిధిలో ర‌హ‌దారుల నిర్మాణానికి 16 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. డ్రైనేజీ, నీటి స‌ర‌ఫ‌రా, ఇత‌ర ప‌నుల‌కు 36 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని వెల్ల‌డించింది. గ‌త ప్ర‌భుత్వ  హ‌యాంలో రూ.42,231 కోట్ల‌తో ప‌నులు ప్రారంభించార‌న్న వైసీపీ ప్ర‌భుత్వం.. ప్ర‌స్తుతం నిధుల స‌మీక‌ర‌ణ కోసం య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా గ‌త నెల 23న సీఆర్డీఏ అధికారుల బృందం బ్యాంకర్ల‌తో స‌మావేశమైంద‌ని పేర్కొంది. రాజ‌ధాని ప‌నుల‌కు రుణాలు ఇచ్చే విష‌యంపై ఇంకా బ్యాంకులు స్పందించ‌లేద‌ని కూడా ప్ర‌భుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News