Qamar Bajwa: పాక్ రాజకీయాల్లో అమెరికా తలదూర్చుతోందన్న ఇమ్రాన్ ఖాన్... విభేదించిన సైన్యాధిపతి
- పాక్ లో రాజకీయ సంక్షోభం
- అవిశ్వాసం ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్
- అమెరికాపై ప్రధాని ఇమ్రాన్ ఆగ్రహం
- అమెరికా మిత్రదేశమన్న సైనిక జనరల్ బజ్వా
అవిశ్వాస తీర్మానం రూపంలో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని గుర్రుగా ఉన్నారు. పాక్ రాజకీయాల్లో అమెరికా తలదూర్చుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ పెద్ద దేశం తమ విపక్ష నేతలను నడిపిస్తోందంటూ పరోక్ష విమర్శలు చేశారు. అయితే, పాకిస్థాన్ సైన్యాధిపతి ఖమర్ జావేద్ బాజ్వా అందుకు భిన్నంగా స్పందించారు.
"చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఏసీ)ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ స్వీయ అభ్యున్నతి కోసం చైనాతో తీవ్రస్థాయిలో అంటకాగింది. అదే సమయంలో అమెరికాతో పాకిస్థాన్ అద్భుతమైన, వ్యూహాత్మకమైన సంబంధాలతో కూడిన సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఇప్పటికీ అమెరికానే పాకిస్థాన్ కు అత్యంత పెద్ద ఎగుమతుల మార్కెట్ గా ఉంది. ఇప్పుడున్న సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని, ఇంకా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మైత్రికి ఇతర అంశాలు కారణం కారాదని కోరుకుంటున్నాం" అని బజ్వా వ్యాఖ్యానించారు.