America: అమెరికాలో తెలుగువారికి మరో అరుదైన గౌరవం.. ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించిన టెక్సాస్ గవర్నర్
- టెక్సాస్‌లో విభిన్న రంగాల్లో తెలుగువారిది కీలక పాత్రన్న గవర్నర్ అబాట్
- కుటుంబ విలువల పట్ల వారికుండే నిబద్ధత ఆదర్శప్రాయమని ప్రశంస
- తెలుగు వారి తరపున అభినందనలు తెలిపిన డాక్టర్ ప్రసాద్ తోటకూర
అమెరికాలో తెలుగువారికి మరో అరుదైన గుర్తింపు లభించింది. శుభకృతు నామ సంవత్సరంతో నూతన ఏడాదిలోకి ప్రవేశించిన తెలుగువారికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తీపి కబురు అందించారు. ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రవాస భారతీయ నాయకుడు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. టెక్సాస్‌లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాలు, వారి సంస్కృతి సంప్రదాయాలతో మమేకమవుతూ విద్య, వైద్యం, వాణిజ్యం, ప్రభుత్వ, కళా రంగాలలో వారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు.
తెలుగు వారి క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల వారికుండే గౌరవం, నిబద్ధత ఆదర్శప్రాయమని గవర్నర్ కొనియాడారు. టెక్సాస్‌లో తెలుగువారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ గ్రెగ్ అబాట్, ఆయన భార్య సిసీలియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.