Hardik Pandya: ఆ ఒక్క ఓవర్ తో ఫలితం మారిపోయింది: హార్ధిక్ పాండ్యా

Lockie Fergusons over changed the momentum Hardik Pandya

  • కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్
  • 15వ ఓవర్లో పంత్, పటేల్ వికెట్ల పతనం
  • గుజరాత్ వైపు తిరిగిన ఫలితం

ఐపీఎల్ లోకి కొత్తగా చేరిన రెండు జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా తీసుకుని, మెగా వేలంలో కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది యాజమాన్యం. క్రికెట్ పండితులు, విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయే రీతిలో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుని టైటిల్ రేసులో బలమైన జట్టుగా కొనసాగుతోంది. కానీ, ఎవరూ కూడా గుజరాత్ జట్టు ఈ స్థాయి ప్రతిభ చూపుతుందని ముందుగా అంచనా వేయలేకపోయారు.

మొదటి మ్యాచు లో ఐపీఎల్ లో కొత్తగా చేరిన మరో జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించిన గుజరాత్ టైటాన్స్.. రెండో మ్యాచ్ లో శనివారం పటిష్ఠమైన ఢిల్లీ జట్టును మట్టి కరిపించింది. ముఖ్యంగా ఈ విజయం బౌలర్ లాకీ ఫెర్గూసన్ ప్రదర్శన వల్లే సాధ్యమైందని చెప్పుకోవాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఢిల్లీని 157 పరుగులకే కట్టడి చేసింది. మొదట ఓపెనర్లు ఇద్దరిని ఫెర్గూసన్ పెవిలియన్ కు పంపించినా.. ఢిల్లీ కుదురుకుని ఆడడం మొదలు పెట్టింది. కానీ 15వ ఓవర్లో ఫెర్గూసన్ మరోసారి చెలరేగి పంత్, అక్షర్ పటేల్ వికెట్లను పడగొట్టడం కీలకంగా మారింది.

ఓపెన్లరు పృథ్వీ షా (10), మన్ దీప్ సింగ్ (18)తో పాటు రిషబ్ పంత్ (43), అక్షర్ పటేల్ (8) వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్ గుజరాత్ టైటాన్స్ ను విజయానికి చేరువ చేశాడు. దీనిపై పాండ్యా స్పందించాడు. ‘‘మా దాడి ప్రకారం చూస్తే 10-15 పరుగులు తక్కువ చేస్తామని ముందుగా అనుకున్నాను. లాకీ పరిస్థితిని మావైపు మార్చేశాడు’’అని పాండ్యా వివరించాడు. అటువైపు పంత్ ఉన్నందున 185 పరుగులు వరకు చేయాలనుకున్నా ఆ మేర ప్రదర్శన చూపించలేకపోయినట్టు అంగీకరించాడు.

  • Loading...

More Telugu News