Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయొచ్చు: పాక్ హోం మంత్రి రషీద్
- అవిశ్వాసంలో ఓడితే అరెస్ట్ చేయవచ్చు
- ఇమ్రాన్ ను వారు ఉపేక్షించరు
- ముందస్తు ఎన్నికలే పరిష్కారమన్న అభిప్రాయం
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ లకు పట్టిన గతే ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఎదురు కానుందా? దీనికి పాకిస్థాన్ హోంమంత్రి మాటల్లోనే సమాధానం లభిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో నేడు ఓటింగ్ జరగనుంది.
ఈ పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓడితే ఆయన్ను అరెస్ట్ చేయవచ్చని పాకిస్థాన్ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఓ వార్తా సంస్థతో అన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి ముందే 155 సభ్యుల అధికారిక కూటమి పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ మూకుమ్మడిగా రాజీనామా చేయవచ్చని చెప్పారు.
‘‘వారు (ప్రతిపక్షాలు) ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తారన్నది నా ఊహ. ఇమ్రాన్ ను వారు ఉపేక్షించరు’’అని రషీద్ అహ్మద్ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడ్ని చేసే విషయంలో విదేశీ కుట్ర ఉందా అన్న ప్రశ్నకు.. పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికి ఎంతో ముప్పు పొంచి ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే దీనికి పరిష్కారమని చెప్పారు. గతంలో నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముషారఫ్ సైతం పదవుల నుంచి దిగిపోయిన తర్వాత అరెస్టవడం తెలిసిందే.