Australia: ఆస్ట్రేలియా ఏడోసారీ.. మహిళల వరల్డ్ కప్ కంగారూలదే
- ఫైనల్ లో ఇంగ్లండ్ కు పరాభవం
- ఆస్ట్రేలియా ఓపెనర్ అలీసా హీలీ సంచలన ఇన్నింగ్స్
- వరల్డ్ కప్ ఫైనల్ లో అత్యధిక పరుగుల రికార్డు కైవసం
- ఆమె ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ కు 357 పరుగుల టార్గెట్
- ధాటిగా ఆడినా 43.4 ఓవర్లలోనే ముగిసిన ఇంగ్లండ్ పోరాటం
- నటాలీ షివర్ సెంచరీ వృథా
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వశమైంది. ఇవాళ క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ఇంగ్లండ్ ను 71 పరుగుల తేడాతో చిత్తు చేసి కప్ ను ఒడిసిపట్టింది. తద్వారా వన్డే వరల్డ్ కప్ ఏడో టైటిల్ ను చేజిక్కించుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేయెన్స్ లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా అలెక్స్ హీలీ ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలి. ఇప్పటివరకు మెన్స్ క్రికెట్ లోనూ సాధ్యపడని రికార్డును ఆమె సొంతం చేసుకుంది.
ఫైనల్ లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 138 బంతుల్లోనే 170 పరుగులు చేసింది. చేసిన బ్యాటర్ గా (మెన్స్ క్రికెట్, విమెన్స్ క్రికెట్ రెండింట్లోనూ) ఆమె రికార్డ్ సృష్టించింది. హీలీ ఇన్నింగ్స్ లో 26 ఫోర్లుండడం విశేషం. ఆమెకు హేయెన్స్ (93 బంతుల్లో 68 పరుగులు), మూనీ (47 బంతుల్లో 62 పరుగులు) జత కలవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును నమోదు చేసింది. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 356 పరుగులను స్కోరుబోర్డుపై ఉంచింది.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆన్య శ్రబ్ సోల్ తప్ప అందరూ ధారాళంగా పరుగులను సమర్పించుకున్నారు. శ్రబ్ సోల్ 10 ఓవర్లు వేసి కేవలం 46 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 43.4 ఓవర్లలో 285 పరుగులకే ఆలౌట్ అయింది. వేగంగా ఆడినా.. అంతే వేగంగా వికెట్లు పడడంతో లక్ష్యానికి దూరంగా ఆగిపోయింది. ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ షివర్ దూకుడుగా ఆడింది. కేవలం 121 బంతుల్లోనే 148 పరుగులు చేసి లక్ష్యం వైపు నడిపించినా ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కొరవడింది. చివరి వికెట్ వరకు షివర్ క్రీజులోనే ఉన్నా.. తోటి బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు.
వాస్తవానికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హిట్టింగ్ వైపే మొగ్గు చూపింది. బ్యాటర్లందరూ వంద స్ట్రైక్ రేటుతో పరుగులు రాబట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలానా కింగ్, జెస్ జాన్సన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డివిరిచారు. మేగన్ షట్ రెండు వికెట్లు తీయగా.. తహీలా మెక్ గ్రాత్, ఆష్లే గార్డ్ నర్ లు తలో వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హీలీనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. సిరీస్ మొత్తం నిలకడగా ఆడినా ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందించారు.
కాగా, ఇప్పటిదాకా ఫైనల్ లో నమోదు చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఆడమ్ గిల్ క్రిస్ట్ పేరిట ఉంది. 2007 వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై అతడు 149 పరుగులు చేశాడు. అంతకుముందు 2003 ఫైనల్ లో భారత్ పై రికీ పాంటింగ్ 140 పరుగులు సాధించాడు. ఫైనల్ లో టాప్ 3 వ్యక్తిగత స్కోర్లు ఆస్ట్రేలియావే కావడం విశేషం. ఇప్పుడు ఆ రికార్డును ఆస్ట్రేలియా బ్యాటర్ హీలీ బద్దలు కొట్టడం విశేషం. అలెక్స్ హీలీ సంచలన ఇన్నింగ్స్ ను ఆమె భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ స్వయంగా వీక్షించాడు. గ్యాలరీలో కూర్చుని కేరింతలు కొట్టాడు.