TRS: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన టీఆర్ఎస్

TRS MPs gives privilege notice to union minister Piyush Goyal
  • పారా బాయిల్డ్ రైస్ ఎగుమతులపై తప్పుడు సమాధానం ఇచ్చారన్న టీఆర్ఎస్ ఎంపీలు
  • దేశాన్ని తప్పుదోవ పట్టించినందుకే నోటీసులిచ్చామని వెల్లడి
  • పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేపట్టిన ఎంపీలు
కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ దాడిని ముమ్మరం చేస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసులు అందజేశారు. పారా బాయిల్డ్ రైస్ ఎగుమతికి సంబంధించి ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పియూష్ గోయల్ ఇచ్చిన సమాధానం అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉందని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. 

డబ్ల్యూటీవో ఆంక్షల వల్లే పారా బాయిల్డ్ రైస్ ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదంటూ పియూష్ గోయల్ పార్లమెంటును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ, లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు ప్రభుత్వ వెబ్ సైట్లో చూపించారని చెప్పారు. సరైన సమాధానం చెప్పకుండా దేశాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడినందుకే కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు. 

మరోవైపు పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. కిసాన్ బచావో, వీ వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
TRS
MPs
Parliament
Piyush Goyal
Previlege Notice

More Telugu News