Ukraine: శవాల దిబ్బగా ఉక్రెయిన్ లోని బుచా నగరం.. వందలాది మందిని చేతులు వెనక్కి కట్టి, తల వెనుక కాల్చిన వైనం!
- రాజధాని కీవ్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా
- బుచా ప్రజలను ఊచకోత కోసిన రష్యా బలగాలు
- 300 మందికి సామూహిక అంత్యక్రియలు
రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ధ్వంసమవుతోంది. ఒక అందమైన దేశం శ్మశానంగా మారుతోంది. నగరాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలోని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ నగరంలో రష్యా సేనలు ప్రజలను ఊచకోత కోశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
బుచా నగరంలో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. ఈ నగరం నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాక... అక్కడకు వెళ్లి చూసిన వారికి ఒళ్లు గగుర్పొడుస్తోంది. వందలాది మందిని రష్యన్ సైనికులు హతమార్చారు. చాలా మృతదేహాలను చూస్తే వారిని నేలపై పడుకోబెట్టి, చేతులు వెనక్కి కట్టి, తల వెనుక భాగం నుంచి కాల్చి చంపినట్టు తెలుస్తోంది.
దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు ఒకే చోట సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీరిలో ఒక పసిబిడ్డ కూడా ఉండటం గమనార్హం. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో వారిని రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని బుచా మేయర్ అనతోలి ఫెడొరికి ఆవేదన వ్యక్తం చేశారు.