Gangula Kamalakar: కేంద్రం తీరుకు నిరసనగా ధాన్యం తూర్పారబట్టిన మంత్రి గంగుల కమలాకర్
- ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో టీఆర్ఎస్ పోరు
- రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు
- కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల నిరసన దీక్ష
- నల్ల దుస్తులు ధరించి వచ్చిన మంత్రి
యాసంగి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంతో టీఆర్ఎస్ సర్కారు తీవ్ర పోరాటం చేస్తోంది. కేంద్రం తీరుకు నిరసనగా తెలంగాణ అధికార పక్షం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీక్షా వేదిక వద్ద ధాన్యాన్ని తూర్పారబట్టి తన నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కొనేదాకా కేసీఆర్ అధ్యక్షతన కేంద్రంపై పోరాటం కొనసాగుతుందని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనకుండా తప్పించుకోవాలని చూస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్టేనని ఉద్ఘాటించారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని రాజ్యాంగం కూడా చెబుతోందని, కానీ కేంద్రమంత్రి పియూష్ గోయల్ తన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.