Jacqueline Fernandez: శ్రీలంక సంక్షోభంపై బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందన ఇదే
- శ్రీలంకకే చెందిన జాక్వెలిన్
- తన గుండె పగిలిందని వ్యాఖ్య
- ఏ ఒక్కరినీ దూషించడానికి త్వరపడకండని విజ్ఞప్తి
శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు రోడ్డెక్కారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలూ చోటుచేసుకున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స ఇంటిని కూడా ప్రజలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా మరోమారు శ్రీలంకలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితిపై బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందిస్తూ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్‌ను పెట్టారు.
శ్రీలంక సంక్షోభంపై ఏ ఒక్కరు కూడా తొందరపడి ఏదో ఒక అంచనాకు రావద్దని సదరు సందేశంలో జాక్వెలిన్ విజ్ఞప్తి చేశారు. శ్రీలంక జాతీయురాలిగా తన దేశాన్ని, దేశ ప్రజలను చూసి తన గుండె పగిలిందని ఆమె వ్యాఖ్యానించారు. తన దేశంలో సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న వాదనలు వినిపించాయని ఆమె చెప్పుకొచ్చారు. కంటికి కనిపించదానినే నమ్మి...ఈ సంక్షోభానికి కారణమంటూ ఏ ఒక్కరిని దూషించరాదని ఆమె విజ్ఞప్తి చేశారు.