Bangladesh: హమ్మయ్య... టీమిండియా చెత్త రికార్డు బంగ్లాదేశ్ జట్టుకు బదిలీ!
- డర్బన్ టెస్టులో బంగ్లా ఘోర పరాజయం
- బంగ్లాదేశ్ లక్ష్యం 274 రన్స్
- రెండో ఇన్నింగ్స్ లో 53కు ఆలౌట్
- కేశవ్ మహరాజ్ కు 7 వికెట్లు
- గతంలో 66 పరుగులకే ఆలౌటైన భారత్
సొంతగడ్డపై ఏ జట్టయినా ఆకలిగొన్న సింహంలా రెచ్చిపోతుంది! సఫారీల గురించి చెప్పేదేముంది! ఇటీవలే టీమిండియాను ఓడించి మాంచి ఊపుమీదున్నారు. తాజాగా బంగ్లాదేశ్ జట్టును తొలి టెస్టులో మట్టికరిపించారు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డు బంగ్లాదేశ్ సొంతమైంది. 274 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ జట్టు కేవలం 53 పరుగులకే చేతులెత్తేసింది. డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో ఇదే అత్యల్పస్కోరు.
గతంలో ఈ అవాంఛనీయ రికార్డు టీమిండియా పేరిట ఉంది. 90వ దశకంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు డర్బన్ టెస్టులో 66 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇన్నాళ్లకు ఆ రికార్డు నుంచి భారత్ కు ఉపశమనం లభించింది. ఇప్పుడది బంగ్లాదేశ్ జట్టుకు బదిలీ అయింది.
తొలిసారిగా సఫారీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు అదే జోరును టెస్టుల్లోనూ ప్రదర్శిస్తుందని క్రికెట్ పండితులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే తొలి నాలుగు రోజులు ఫర్వాలేదనిపించింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 367 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 298 పరుగులు చేసింది. ఆపై దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ ముందు 274 పరుగుల టార్గెట్ నిలిచింది.
కానీ సఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 7 వికెట్లు తీసి బంగ్లా జట్టును చావుదెబ్బ కొట్టాడు. దాంతో ఆ జట్టు 19 ఓవర్లలో 53 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా జట్టులో నజ్ముల్ హుస్సేన్ (26), తస్కిన్ అహ్మద్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలన వాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. వారిలో నలుగురు డకౌట్ అయ్యారు.