Pushpa Munjial: తన యావదాస్తిని రాహుల్ గాంధీ పేరిట రాసిన 78 ఏళ్ల వృద్ధురాలు
- ఉత్తరాఖండ్ లో ఘటన
- రాహుల్ పై అభిమానం చూపిన పుష్ప ముంజియాల్
- రూ.50 లక్షల విలువైన ఆస్తి, 10 తులాల బంగారం బదలాయింపు
- కోర్టులో వీలునామా అందజేత
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్. అయితే, గత రెండు పర్యాయాలు బీజేపీ ప్రభంజనంతో విపక్ష హోదాకే పరిమితమైంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న కాంగ్రెస్ అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే, ఓ వృద్ధురాలు మాత్రం రాహుల్ పై ఎనలేని నమ్మకం చూపుతుండడం విశేషం.
ఆమె పేరు పుష్ప ముంజియాల్. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన పుష్ప ముంజియాల్ వయసు 78 ఏళ్లు. తాజాగా ఈ వృద్ధురాలు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే, ఆమె తన యావదాస్తిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరిట బదలాయించారు. తనకున్న రూ.50 లక్షల విలువైన ఆస్తులను, 10 తులాల బంగారాన్ని రాహుల్ కు రాసేశారు. ఈ మేరకు డెహ్రాడూన్ కోర్టులో తన వీలునామా సమర్పించారు.
తన ఆస్తులపై సర్వ హక్కులను రాహుల్ గాంధీకి బదిలీ చేస్తున్నట్టు ఆమె తన వీలునామాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ముంజియాల్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ సేవలు, అతడి ఆలోచనలు దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాహుల్ విధానాలతో తాను ఎంతగానో ప్రభావితమయ్యానని తెలిపారు. అందుకే అతడికి తన ఆస్తి రాసిచ్చానని వెల్లడించారు.
ఈ మేరకు అవసరమైన పత్రాలను ఆమె రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కు అందజేసినట్టు కాంగ్రెస్ నేత లాల్ చంద్ శర్మ తెలిపారు.