Rahul Gandhi: టీఆర్ఎస్, ఎంఐఎంలతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ!
- ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్న రాహుల్
- తెలంగాణ నేతలంతా కలసికట్టుగా పని చేయాలని సలహా
- పని చేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న రాహుల్
టీఆర్ఎస్, ఎంఐఎంలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో నిన్న రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటని రాహుల్ ను నేతలు అడిగారు. దీనికి సమాధానంగా రాహుల్ ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
సమావేశం సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ ను తెలంగాణ నేతలకు రాహుల్ పరిచయం చేశారు. తెలంగాణ, కర్ణాటక వ్యవహారాలను సునీల్ చూస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ ఎన్నికల వ్యూహకర్త కాదని... కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పారు. అందరం కలిసి పని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
నియోజకవర్గాల్లో పని చేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని రాహుల్ చెప్పారు. క్రమశిక్షణతో నాయకులందరూ కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. మరోవైపు ఈ సమావేశంలో జానారెడ్డి తెలుగులో మాట్లాడగా... దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రాహుల్ కి వినిపించారు.