Andhra Pradesh: ఈ నెల 7న ఏపీ కేబినెట్​ భేటీ.. కొత్త మంత్రుల ప్రమాణం ఎప్పుడంటే..!

AP Cabinet Meeting Schedule Has Small Changes
  • ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు తొలుత నిర్ణయం
  • అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ వాయిదా
  • సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు
  • సీఎం జగన్ కు వేరే పర్యటన ఉండడం వల్లే
  • ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణం! 
ఏపీ కేబినెట్ భేటీ సమయం మారింది. ముందుగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినా.. ఆ తర్వాత దానిని మధ్యాహ్నానికి మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు. సీఎంకు కొన్నిచోట్ల పర్యటనలు ఉండడం వల్లే సమావేశాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ నెల 6న నరసరావుపేటలో జరిగే వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల 7న ఉదయానికి మార్చారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశ సమయాన్ని మార్చారని అంటున్నారు. 

సమావేశం జరిగే ఆ రోజే.. పదవులు కోల్పోతున్న మంత్రుల పేర్లను సీఎం జగన్ ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆరోజే వారితో రాజీనామా చేయించి.. తెల్లారి అంటే ఈ నెల 8న గవర్నర్ వద్దకు వెళ్లి కొత్త వారిని నియమించేందుకు అనుమతి కోరనున్నట్టు సమాచారం. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే అదే రోజు కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

ఆ తర్వాత ఈ నెల 11న ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించబోతున్నారని చెబుతున్నారు. వెలగపూడిలోని సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Andhra Pradesh
YS Jagan
Sameer Sharma
AP Cabinet

More Telugu News