Immune System: అస్తమానం చిరాకు పడడమూ బలహీన రోగనిరోధక వ్యవస్థకు సూచనే.. వీక్ ఇమ్యూనిటీ లక్షణాలివీ..!
- తరచూ నీరసంగా ఉండడం వీక్ ఇమ్యూనిటీనే కారణం
- తరచూ జలుబు చేసినా అనుమానించాల్సిందే
- గాయాలు ఆలస్యంగా మానడమూ కారణమే
శరీరానికి హాని చేసే క్రిములు మన ఒంట్లోకి ప్రవేశించగానే వాటిపై దాడి చేసి చంపేయడమే మన రోగనిరోధక వ్యవస్థ పని. ఓసారి సూక్ష్మక్రిములు దాడి చేస్తే వాటిని చంపేశాక.. మన రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తు పెట్టుకుని జీవితాంతం రక్షణనిస్తుంది. కానీ, అది బలహీనంగా మారిపోతే.. చిన్న గాయమైనా మానడానికి నెలలు పడుతుంది. మనల్ని మరింత బలహీనం చేస్తుంది. మన శరీరమే క్రిముల ఎదుగుదలకు రిజర్వాయర్ గా మారుతుంది. మరి, మన రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని తెలుసుకోవడం ఎలా? రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసుకోవడమెలా?
బలహీన ఇమ్యూనిటీకి ఇవీ లక్షణాలు...
చిరాకు: ఆరోగ్యవంతులే ఎప్పుడూ ప్రశాంతమైన మైండ్ ను కలిగి ఉంటారు. ఎప్పుడైనా ఒంట్లో బాలేదు అంటే.. అది మన మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంటుంది. బయటి క్రిముల దాడి ద్వారా కొన్నిసార్లు మనకు చిరాకుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచూ చిరాకు పడుతూ ఉంటే కచ్చితంగా ఓసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి రావడం మంచిది. లేదంటే వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఇన్ ఫెక్షన్లపై ఓ కన్నేసి ఉంచాలి.
నీరసం: చాలా సార్లు మన స్నేహితుల దగ్గర్నో లేదంటే కుటుంబ సభ్యుల దగ్గరనో.. చాలా నీరసంగా ఉందని ఎప్పుడో ఓ సందర్భంలో చెబుతూనే ఉంటాం. అయితే, తరచూ నీరసంగా ఉండడమూ బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థకు సంకేతమే. దాని వల్ల మన ఒంట్లోని శక్తి మొత్తం హరించుకుపోతుంది. ఒంట్లోని క్రిములపై పోరాడే క్రమంలో మన శరీరం శక్తిని ఇమ్యూన్ సిస్టమ్ తీసుకుంటూ ఉంటుంది.
గాయాలు త్వరగా మానకపోవడం: మామూలుగా ఏదైనా చిన్న గాయమైతే వారం లోపల మానిపోతుంటుంది. కానీ, నెలల తరబడి మానకుండా ఉంటే? ఎందుకని ఆలోచించారా? దానికీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడమే కారణం. ఇమ్యూనిటీ వీక్ గా ఉండడం వల్ల గాయం వద్ద కొత్త చర్మం పుట్టడం, గాయం మానడం ఆలస్యమవుతుంటుంది. మన రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా గాయం మానుతుంది.
తరచూ జలుబు: మామూలుగా ఏడాదిలో ఒకట్రెండు సార్లు జలుబు రావడం సర్వసాధారణం. కానీ, అంతకుమించి తరచూ జలుబు బారిన పడుతుంటే.. కారణమేమై ఉంటుందంటారు? ఎప్పుడైనా పరిమితికి మించి జలుబు చేసిందంటే ఇమ్యూన్ సిస్టమ్ పై ఓ కన్నేసి ఉంచాల్సిందే. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి తరచూ జలుబు వస్తుంటుంది. అలాంటి వారికి వ్యాధులూ త్వరగా సంక్రమిస్తుంటాయి.
పొక్కులు రావడం: తరచూ ఒంటిపై పొక్కులు వస్తున్నాయా? రాకపోతే సమస్యేం లేదుకానీ.. వస్తేనే బలహీనమైన ఇమ్యూనిటీ అని అనుకోవాలి. ఆ పొక్కుల వల్ల ఇన్ ఫెక్షన్ రావడం, త్వరగా మానకపోవడం వంటి సమస్యలుంటాయి.
ఏం చేయాలి?
చిన్న చిన్న ఇన్ ఫెక్షన్లనే తగ్గించలేక ఇమ్యూనిటీ వీక్ అయిపోతే.. వెంటనే దానిని బలవర్థకంగా మార్చుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. మొదటగా డాక్టర్ ను కలవాలి. మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రత్యేకించి మంచి ఆహారపుటలవాట్లను చేసుకోవాలి. విటమిన్ సీ ఉండే ఆహారపదార్థాలను తీసుకునేట్టు చూడాలి. ఆర్గానిక్ సీజనల్ ఫుడ్స్ ను తింటూ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లుండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. ప్రత్యేకించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన ఆహారాన్ని తింటే రోగనిరోధక వ్యవస్థ మెరుగయ్యే అవకాశం ఉంటుంది.