AB Venkateswara Rao: ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చా.. షోకాజ్ నోటీసుకు ఏబీ వెంకటేశ్వరరావు జవాబు
- వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై స్పందించవచ్చు
- ఆ అవకాశాన్ని ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయి
- రూల్-17కి అనుగుణంగానే గత నెల మీడియాతో మాట్లాడాను
- ఆరోపణలు చేస్తే దానిపై స్పందించకూడదా? అని ప్రశ్నించిన ఏబీ
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)కు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. పెగాసస్ సాఫ్ట్వేర్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వడంతో, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఆయన ఆ సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని ఆయనకు ప్రభుత్వం మెమో జారీచేసింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు ఏపీ ప్రభుత్వానికి వివరణ ఇస్తూ లేఖ రాశారు.
వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై స్పందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయా అంశాలపై స్పందించే అవకాశాన్ని ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని, రూల్-17కి అనుగుణంగానే తాను గత నెల మీడియాతో మాట్లాడానని తెలిపారు.
తాను గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్వేర్ వినియోగించలేదని మాత్రమే మీడియా సమావేశంలో చెప్పానని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్-6 ప్రకారం అధికారిక అంశాలపై వివరణ ఇవ్వవచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం... అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని నిబంధనల్లో ఉందని, తాను మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తే దానిపై స్పందించకూడదా? అని ఆయన ప్రశ్నించారు. అంతేగాక, ఆర్టికల్-21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని, మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయంపై ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చానని ఏబీ తన లేఖలో పేర్కొన్నారు.