Dharmana Krishna Das: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు
- మంత్రిగా నేను దిగిపోతున్నా
- తమ్ముడు ప్రసాదరావు మంత్రి కాబోతున్నాడు
- ఎవరు మంత్రిగా ఉన్నా కుటుంబమంతా ఒక్కటేనన్న కృష్ణదాస్
ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుతీరేందుకు సమయం ఆసన్నమయింది. ప్రస్తుత కేబినెట్ చివరిసారిగా రేపు భేటీ కాబోతోంది. ఇప్పుడున్న మంత్రులందరూ పదవులను వదిలేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. మంత్రిగా తన అధ్యాయం ముగిసిందని పేర్ని నాని కూడా ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఈ విషయాన్ని తాను కాదని చెప్పలేనని అన్నారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని... తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని చెప్పారు.
వైయస్ మరణం తర్వాత తాను జగన్ వెంట నడిచానని... ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని అన్నారు. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు... నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ అన్నారు.
2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశాడని... ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించి డిప్యూటీ సీఎం చేశారని... మూడేళ్లు ఖాళీగా ఉన్న తమ్ముడు రేపో, మాపో మంత్రి అవుతాడని అన్నారు. ఎవరు మంత్రిగా ఉన్నా.. తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు.