RRR: ఎన్టీఆర్ ను అలా చూసి ఏడుపొచ్చేసింది.. తారక్ ను ఆకాశానికెత్తేసిన ఒలీవియా మోరిస్
- కొమురం భీముడో పాటతో భావోద్వేగానికి లోనయ్యానన్న ఒలీవియా
- జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ ప్రశంస
- చరణ్ మంచి స్నేహితుడయ్యాడు, రాజమౌళి గొప్ప దర్శకుడు అంటూ కామెంట్
- హైదరాబాద్ సిటీని చూడలేకపోయానన్న ఒలీవియా
‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ లేడీ లవ్ ‘జెన్నీ’గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఒలీవియా. ఆ పాత్రలో ఆమె చాలా చక్కగా ఒదిగిపోయింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సక్సెస్ లో భాగంగా ఓ పోర్టల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేసింది.
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. తారక్ చాలా గొప్ప నటుడని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కొనియాడింది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మొహంలో చిరునవ్వుతోనే సెట్ లోకి అడుగుపెట్టేవాడని, కానీ, ఆయన్ను చూడగానే తనకు టెన్షన్ పట్టుకునేదని తెలిపింది.
కొమురం భీముడో పాటలో తారక్ ను చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని ఒలీవియా చెప్పింది. ఆ పాటలోని సన్నివేశాలకు తాను భావోద్వేగానికి గురయ్యానంది. చరణ్ మంచి స్నేహితుడయ్యాడని, తామిద్దరం లండన్ లోని పరిసరాల గురించి మాట్లాడుకునేవాళ్లమని తెలిపింది. ‘నాటు నాటు’ పాటకు తన బాయ్ ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడని చెప్పింది. ఇంట్లో ఎప్పుడూ ఆ పాటే పాడుతున్నాడని పేర్కొంది.
కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. ఆర్ఆర్ఆర్ ఆడిషన్స్ కోసం వీడియో షూట్ చేసి పంపించానని చెప్పిన ఆమె.. కొన్ని నెలల పాటు టీమ్ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదని పేర్కొంది. కానీ, ఒకరోజు సడన్ గా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పింది.
రాజమౌళి చాలా గొప్ప డైరెక్టర్ అని ఒలీవియా ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ లో కేవలం 20 రోజులే షూటింగ్ లో పాల్గొన్న ఆమె.. సిటీలో పెద్దగా తిరగలేకపోయానని, సెట్స్ లో అందరూ తనను బాగా చూసుకున్నారని చెప్పింది.
ఇక సినిమాల్లో కెరీర్ పరంగా ఒలీవియాకు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సినిమా. అయితే, ‘హోటల్ పోర్టోఫినో’ అనే బ్రిటీష్ టీవీ సీరియల్ తో ఆమె నటనలో అరంగేట్రం చేసింది.