Revanth Reddy: గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చి మరీ నిరసనలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఫొటోలు ఇవిగో
- విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి పిలుపు
- ప్రజలే నా ధైర్యం-పోరాటమే నా ఊపిరి అన్న రేవంత్ రెడ్డి
- ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాడతానని స్పష్టీకరణ
హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఎంపీ రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి బయటపడి నిరసనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
'ప్రజలే నా ధైర్యం-పోరాటమే నా ఊపిరి ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎంతగా అణచివేసినా ప్రజల కోసం, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పదునెక్కిన పోరాటాలు నిర్మించడం నా నైజం. విద్యుత్ ఛార్జీలు, గ్యాస్-డీజిల్-పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే దుర్మార్గపు నిర్ణయాలు వద్దు .
పేదలు, మధ్య తరగతిని దోచుకోవడంలో మోడీ- కేడీ అవిభక్త కవలలు. వారిద్దరి నుంచి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం' అని రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.