Daggubati Purandeswari: చంద్రబాబు అన్యాయం చేశారు సరే... న్యాయం చేస్తానన్న జగన్ ఏంచేశారు?: పురందేశ్వరి
- ఉత్తరాంధ్రకు జలాల కోసం బీజేపీ పోరు
- జనపోరు యాత్ర ప్రారంభం
- జగన్ ఎందుకు ముఖం చాటేస్తున్నారన్న పురందేశ్వరి
- నిర్వాసితులను పట్టించుకోవడంలేదని ఆరోపణ
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఉత్తరాంధ్రలో జలాల కోసం బీజేపీ జనపోరు యాత్రను ఆమె నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాజెక్టులు, నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అన్యాయం చేశారు సరే... న్యాయం చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జగన్ ఎందుకు ముఖం చాటేస్తున్నారో చెప్పాలన్నారు.
వైసీపీ సర్కారు వంశధార నిర్వాసితులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 16 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పూర్తికాకుండా ఉందని అన్నారు. వంశధార ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు వలస వెళుతున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రాజెక్టులపై తమకు అవగాహన ఉందని, ఇక్కడి నేరడి ప్రాజెక్టు కోసం ఒడిశాతో వివాదం ఉందని తెలిపారు. నిర్వాసితులను రాజకీయ ప్రయోజనాల కోసం నమ్మించి ముంచారని పురందేశ్వరి విమర్శించారు.
తమను ప్రజలను ఆశీర్వదించకపోయినా, తాము ప్రజల పక్షాన పోరాడతామని వెల్లడించారు. ఇతర పార్టీలు అధికారంలోకి రావడానికి హామీలు ఇస్తాయని, బీజేపీ మాత్రం దేశ సేవ కోసం అధికారాన్ని వినియోగిస్తుందని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజేపీ దూరమని ఉద్ఘాటించారు.