AP Cabinet: ఆ ఐదారుగురు ఎవరు?... ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్
- ఐదారుగురికి ఛాన్సే దక్కొచ్చన్న కొడాలి నాని
- వారెవరన్నది తనకు తెలియదని వ్యాఖ్య
- కొత్త కేబినెట్‌లోకి పాత మంత్రులెవరన్న దానిపై చర్చ
ఏపీలో ఇప్పుడో అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ కేబినెట్‌లో మొత్తం 24 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ఆయనకే అందజేశారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా జగన్ మంత్రులకు వివరించారు.
ఈ క్రమంలో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మంత్రి కొడాలి నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదుగురో, ఆరుగురో తిరిగి కొత్త మంత్రివర్గంలో పనిచేసే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పనితీరులో సత్తా కనబరచిన వారో, అనుభవమున్న సీనియర్లో, లేదంటే సామాజిక వర్గ సమీకరణాలో తెలియదు గానీ... ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదారుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు.
కొడాలి నాని వ్యాఖ్యలతో ఏపీలో ఒక్కసారిగా ఓ పెద్ద చర్చకు తెర లేచింది. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే ఐదారుగురు పాత మంత్రులు ఎవరంటూ ఎవరికి తోచిన లెక్కలతో వారు అంచనాలేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గ సమీకరణాలను ప్రధానంగా ముందేసుకుని మరీ కొందరు లోతైన చర్చల్లోకి మునిగిపోయారు. అయితే ఆ ఐదారుగురు ఎవరన్న విషయం మాత్రం జగన్ ప్రకటించే దాకా ఏ ఒక్కరికీ తెలియదనే చెప్పాలి. ఈ తరహా వ్యవహారాల్లో చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తున్న జగన్.. చివరి నిమిషం దాకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.