Nariman Contractor: భారత మాజీ క్రికెటర్ తలలో అమర్చిన ప్లేట్ ను తొలగించిన వైద్యులు
- 1962లో గాయపడిన నారిమన్ కాంట్రాక్టర్
- చార్లీ గ్రిఫిత్ బౌన్సర్ కు కుప్పకూలిన వైనం
- డాక్టర్ చండీ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స
- తలలో ప్లేట్ అమరిక
- ప్రస్తుతం నారిమన్ కు 88 ఏళ్లు
- ప్లేట్ పై ఊడిపోతున్న చర్మం
భారత క్రికెట్ పాతతరం ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన నారిమన్ కాంట్రాక్టర్ కెరీర్ అప్పట్లో విచారకర పరిస్థితుల్లో ముగిసింది. వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన ఓ బౌన్సర్ తలకు బలంగా తాకడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ సమయంలో భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తోంది.
తీవ్రంగా గాయపడిన నారిమన్ కాంట్రాక్టర్ ను హుటాహుటీన భారత్ తరలించారు. ఆయనకు పుర్రె భాగం దెబ్బతినడంతో తలలో ఓ ప్లేట్ అమర్చారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ చండీ ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇదంతా 1962లో జరిగింది.
అయితే నారిమన్ కాంట్రాక్టర్ ప్రస్తుత వయసు 88 ఏళ్లు. ఈ నేపథ్యంలో, తలలో అమర్చిన ప్లేట్ ను కప్పి ఉంచిన చర్మం క్రమంగా బలహీనంగా మారింది. చర్మం ఊడిపోతుండడంతో ఆ ప్లేట్ ను తొలగించాలని డాక్టర్లు నిర్ణయించారు. ఎప్పుడో 60 ఏళ్ల కిందట అమర్చిన ఈ ప్లేట్ ను ముంబయి వైద్యులు తాజాగా తొలగించారు. దీనిపై నారిమన్ కాంట్రాక్టర్ కుమారుడు వివరణ ఇచ్చారు.
తన తండ్రికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని వెల్లడించారు. ఇది తేలికపాటి శస్త్రచికిత్సే అయినా తన తండ్రి వయసు రీత్యా తాము ఆందోళనకు గురయ్యామని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వివరించారు.
నారిమన్ కాంట్రాక్టర్ భారత్ తరఫున 31 టెస్టులాడి 1,611 పరుగులు చేశారు. వాటిలో 1 సెంచరీ, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో 138 మ్యాచ్ లు ఆడి 8,611 పరుగులు సాధించారు. వాటిలో 22 సెంచరీలు ఉన్నాయి.
ఎంతో ప్రతిభావంతుడు అయినప్పటికీ, ఓ గాయంతో ఆయన కెరీర్ నిలిచిపోయింది. దురదృష్టమేమిటంటే... ఆనాటి మ్యాచ్ లో ఆయన ఇచ్చిన క్యాచ్ ను వెస్టిండీస్ ఫీల్డర్ జారవిడిచాడు. కానీ ఆ తర్వాత బంతే తలకు తాకింది. ఒకవేళ వెస్టిండీస్ ఫీల్డర్ క్యాచ్ పట్టి ఉంటే నారిమన్ కాంట్రాక్టర్ అవుటై పెవిలియన్ కు చేరేవాడు. ఆ దెబ్బ తగిలి ఉండేది కాదు.