rbi: ఆర్బీఐ మానిటరీ పాలసీ అసలు ఏం చేస్తుందో తెలుసా..?

What are repo rate reverse repo and monetary policy
  • ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది
  • వ్యవస్థలో నగదు సరఫరాను నియంత్రిస్తుంది
  • వినియోగ డిమాండ్ ను నిర్ణయిస్తుంది
  • ధరలను కట్టడి చేస్తుంది
మానిటరీ పాలసీ అంటే కొన్ని రకాల సాధనాలతో దేశంలో ద్రవ్య విధానాన్ని నిర్వహించడంగా అర్థం చేసుకోవాలి. వీటి సాయంతో దేశ ఆర్థిక వృద్ధికి సెంట్రల్ బ్యాంకులు ప్రోత్సాహాన్నిస్తాయి. వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదును నియంత్రిస్తుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా నగదు చలామణిని పెంచడం, తగ్గించడం, తటస్థంగా ఉంచడం చేస్తాయి.

వాణిజ్య బ్యాంకులకు నగదు సరఫరాను నియంత్రించే సాధనాలు ఆర్బీఐ వద్ద ఉంటాయి. వీటినే పరిస్థితులకు అనుగుణంగా వినియోగిస్తుంటుంది. రెపో, రివర్స్ రెపో, మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో.. ఇలా ఎన్నో ఉన్నాయి. వృద్దికి మద్దతునివ్వడం, ధరలను అదుపు చేయడం, నగదు చలామణిని నియంత్రించడం ఆర్బీఐ చూసే ప్రధాన బాధ్యతలు. 

రెపోరేటు
వాణిజ్య బ్యాంకులు తమ కార్యకలాపాలకు వీలుగా అవసరమైన నిధులను ఆర్బీఐ నుంచి తీసుకోవచ్చు. ఇలా బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. నేడు దాదాపు అన్ని రుణాలను రెపో రేటుకు అనుసంధానంగానే బ్యాంకులు అందిస్తున్నాయి. మనం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే దానిపై వడ్డీ వసూలు చేస్తాయి కదా.. అచ్చం అలాగే ఆర్బీఐ కూడా తన నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే చార్జీయే రెపో రేటు.

రివర్స్ రెపో
ఇది రెపో కు విరుద్ధమైనది. బ్యాంకులు తమవద్దనున్న అదనపు నిధులను ఆర్బీఐ వద్ద పార్క్ చేసుకోవచ్చు. ఈ నిధులపై ఆర్బీఐ అందించే రేటే రివర్స్ రెపో రేటు. వ్యవస్థలో (బ్యాంకుల్లో) నగదు చలామణి ఎక్కువగా ఉందనుకుంటే రివర్స్ రెపోను ఆర్బీఐ పెంచుతుంది. దీంతో మంచి రేటు వస్తుందని బ్యాంకులు తీసుకెళ్లి ఆర్బీఐ వద్ద అధికంగా నిల్వలు ఉంచుతాయి. తద్వారా వ్యవస్థలో లిక్విడిటీని తగ్గిస్తుంది.

రివర్స్ రెపో కంటే రెపో ఎక్కువ
రెపో అంటే ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో అంటే బ్యాంకులకు చెల్లించేది. బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేస్తే ఇచ్చే రేటు కంటే.. రుణం తీసుకుంటే ఎక్కువ రేటు విధించడం తెలిసిందే. అలాగే ఆర్బీఐ కూడా నిధులపై ఆదాయం కోసం రెపో, రివర్స్ రెపో మధ్య అంతరం పాటిస్తుంటుంది.

బ్యాంకింగ్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి నగదు సరఫరా అవుతుంటుంది. ఆ సరఫరా ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించేందుకు ఆర్బీఐకి రెపో, రివర్స్ రెపో కీలకమైన ఆయుధాలు అవుతాయి. వీటితోనే వడ్డీ రేట్లు ఎంత ఉండాలన్నది నిర్ణయిస్తుంది. పరోక్షంగా వ్యవస్థలో  వినియోగ డిమాండ్ ను ఆర్బీఐ వీటితో సమన్వయం చేయగలదు. రెపో రేటును తగ్గించడం వల్ల బ్యాంకులు.. వాహన, గృహ, వ్యాపార రుణాలపై రేట్లను తగ్గిస్తాయి. దాంతో వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఆ నిధుల అండతో వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది.
rbi
monetary policy
repo
reverse repo
tools
economy

More Telugu News